మామడ మండలంలోని పోతారం గ్రామంలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ పెద్ద భీమన్న స్వామి జాతర మహోత్సవాలను రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుండగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, భక్తుల మొక్కులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతరలో భాగంగా భీమన్న స్వామివారు పోతారం నుంచి పరిసర పల్లెలు, గ్రామాల్లో పర్యటించి తిరిగి శనివారం స్వగ్రామమైన పోతారానికి చేరుకోనున్నారు. అనంతరం ఆదివారం స్వామివారిని గ్రామంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
ఆదివారం సాయంత్రం స్వామివారు గంగాస్నానానికి వెళ్లే కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం మేడిగుంది భీమన్న ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా బండారు బసంతం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవాలకు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులందరూ జాతరలో పాల్గొని శ్రీ పెద్ద భీమన్న స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని గ్రామీణాభివృద్ధి కమిటీ, భీమన్న కమిటీ, గ్రామ పరిపాలన అధికారులు, గ్రామ ప్రజలు కోరారు.











