మండలంలోని దొడర్నా తండాలో శ్రీ జగదాంబ మాత, హనుమాన్ ఆలయాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే, జై జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ మందిరాల కలశ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు భోస్లే మోహన్రావు పాటిల్ హాజరయ్యారు. నూతనంగా ప్రతిష్ఠించిన జగదాంబ మాత విగ్రహాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని, ఆలయ అభివృద్ధి, గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.
ఈ సందర్భంగా మోహన్రావు పాటిల్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.








