ఎన్టీఆర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నందూస్ వరల్డ్ నిర్వాహకురాలు అన్నే రమానందనను పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా రెన్యూవల్, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారనే మోసపూరిత కేసులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆమె భర్త, మామ కూడా నిందితులుగా ఉన్నారు.
పాపులర్ యూట్యూబర్ నందన అరెస్ట్ చీటింగ్ కేసులో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి.. వీసా రెన్యూవల్, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదులు హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు అన్నే రమానందనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చీటింగ్ కేసులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, ఆయన తండ్రి మోహన్‌రావుపైనా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన రమానందన, ఆమె భర్త ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. రమానందన ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందారు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యూవల్ చేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్‌కు లండన్‌లో ఉన్న సమయంలో మధుకర్‌తో పరిచయం ఏర్పడింది. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం వీసా రెన్యూవల్, తన భార్యకు ఉద్యోగం కోసం సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ (CoS) ఇప్పిస్తామని మధుకర్ చెప్పినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకోసం రూ.15 లక్షలు చెల్లించాలని చెప్పడంతో 2023లో నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మధుకర్‌ను ఏ1గా, రమానందనను ఏ2గా, మోహన్‌రావును ఏ3గా చేర్చినట్లు సమాచారం. కేసు నమోదు అనంతరం మరికొందరు బాధితులు కూడా ఇదే తరహాలో తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతుండగా శంషాబాద్ విమానాశ్రయంలో రమానందనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.












