సమాజంలో నెలకొన్న కుల వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలించడమే పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని భోరజ్ మండల తహసిల్దార్ రాథోడ్ బాబు సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం సావాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సావాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ బాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహసిల్దార్ రాథోడ్ బాబు సింగ్ మాట్లాడారు. సమాజంలో కుల వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి, పౌర హక్కులపై అవగాహన కల్పించడానికి ప్రతినెలా చివరి రోజున మండలంలోని ఏదో ఒక గ్రామపంచాయతీలో లేదా గ్రామంలో ఈ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. పౌర హక్కుల దినోత్సవం లో భాగంగా సమానత్వం, కులమత వర్గ బేధాలు లేకుండా అందరూ సోదర భావంతో, కులమతాలకు అతీతంగా మెలిగేలా చూడడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి గ్రామీణ ప్రజలకు తెలియజేయడం వంటివి ముఖ్య లక్ష్యాలని ఆయన వివరించారు.
సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూస్తూ, అణగారిన వర్గాలపై జరిగే అన్యాయాలను లేదా వేధింపులను, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. దీని కోసం రెవెన్యూ, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి నెలా చివరి రోజు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైనాథ్ ఏఎస్ఐ స్వామి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ బాయి, ఉప సర్పంచ్ గుమ్మల సునీల్, ఐకెపి సెర్ప్ ఏపీఎం మాధవ్, ఎల్ దత్తు, హెచ్డబ్ల్యూఓ, ఎస్.సి.డి., భోరజ్ మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్ట అశోక్, పంచాయతీ సెక్రెటరీ నీతారాణి, అంగనవాడి కార్యకర్త పూజ, వీవోఏ వందన, అధికారులు శివమూర్తి, ఐలయ్య, పాఠశాల హెచ్ఎం స్వరూప, వార్డ్ సభ్యులు విట్టల్, నరేష్, గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












