వెలుగుల పండుగ దీపావళి వేళ, దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, తుఫానుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదల, ఉపాధి లేమి, నీటి కొరత వంటి సమస్యలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు.
దీపావళి రూపశోభే, పెను చీకట్లు వెలుగుతూనే కూర్చున్నవి. అంతరంగంలో మనసు విప్పుకోవడమే అసలు వెలుగు అంటారు కవి. దీపావళి గురించి కవులు చాలానే చెప్పారు. దీపావళి ఉత్సవమండీ దీపావళి చేద్దాం రండి ఆకాశం మండిద్దామా పాతాళం తగలేద్దామా నరకాసురుడెందుకు ప్రపంచ నరకాన్ని మసి చేద్దామా తమ బతుకుల ఆఖరి శ్వాసలు, వదలిన చల్లారిన ఆశలు, మొగముపైన నల్లని దుప్పటి, కన్నుమిన్ను కానని చీకటి, రండోయ్ చితులు రగల్చండి అంటూ పిలుపునిచ్చాడు కవి ఆలూరి బైరాగి. కవి చెప్పినట్లుగానే తమ బతుకుల చివరి శ్వాసలు తీస్తున్న రైతన్నల వెతలు ఇప్పుడు మన నేలపై దర్శనమిస్తున్నాయి. వెలుగుల జీవితం కనుమరుగు అయిపోయింది.
అలుముకున్న చీకట్ల బతుకుల్లో దీపాలు వెలిగించేదెవరు దీపం, చీకట్లను తరిమే వెలుగే కానీ జీవితంలోని చీకటిని తరిమేయకుండా కేవలం దీపాలను వెలిగించి సంబరపడితే ఉపయోగమేముంది నరకాసురుని వధించిన సందర్భాన్ని, ఒక పీడకుని మరణాన్ని ఉత్సవం చేసుకోవడం మనకు పురాణకాలం నుంచే ఉందనడానికి ఇదో ఉదాహరణ. పీడకులు, జనం చేత తరిమి కొట్టబడుతారనేది వాస్తవమే.
కానీ కొందరి మరణ సన్నివేశాన్ని పండుగెలా చేసుకుంటారు ఇప్పుడు అది తమకు నచ్చని, ప్రత్యర్థి మరణమూ వేడుకలా మారిపోయింది. ఇది అత్యంత అనాగరికం. నేడు ఒక అనాగరిక ఆలోచనా ధోరణి పెరిగిపోతోంది. దీనికి మనకు తరతరాలుగా వస్తున్న పురాణ కథా సందర్భాలు పునాదిగా నిలుస్తున్నాయా ఇది ఆలోచించాల్సిన అంశం. చర్చ జరగవలసి ఉంది. రాజుల, ఆధిపత్య వర్గాల కాలంలోని కథనాల పరంపర ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ అంతర్గతంగా కొనసాగటాన్ని గమనించవచ్చు. ఇది నిరంకుశ, ఆధిపత్య వర్గాలను బలపరిచే అంశంగానూ పనిచేస్తుంది. ఇవన్నీ చర్చించి తేల్చదగిన అంశాలు.
అయితే సంతోషానికి, సంబరాలకు ప్రతీకగా నిలిచే వెలుగుల శోభకు దీపం కారణమే. ఈ దీపాన్ని, దీపపు మూలమైన అగ్నిని, నిప్పును కనిపెట్టిన వాడు మాత్రం ఆదిమ మానవుడే. అతని నిరంతరాన్వేషణ, పరిశ్రమలోంచి చీకటిని తరిమే వెలుగూ, నిప్పూ ఆవిష్కృతమయ్యాయి. ఆ చరిత్రను అలా ఉంచితే, ఇప్పుడు అనాదిగా వస్తున్న దీపావళి పండుగను సంతోషంగా జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
రైతుల దుస్థితి
ముఖ్యంగా దేశానికి వెన్నెముక అన్నదాత తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు రైతు. మురస తుఫాను కారణంగా చేలనిండా కన్నీళ్లు నిండి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కొట్టుకుపోయింది. గుండెలు పగిలిపోయిన రైతన్నలు ఏం సంబరాలు చేసుకుంటారు ఏం చేయాలో తెలియక నిరాశలో గ్రామీణమంతా మునిగిపోయి ఉంది. ఒకవైపు ఎల్ నినో కారణంగా కరువు కోరలు చాస్తుంటే, రెండోవైపు తుఫాను బీభత్సం వ్యవసాయాన్ని దుఃఖ సాగరం చేసింది. ప్రభుత్వాలు మరి ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేస్తాయో ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు, కార్పొరేట్ పద్మ వ్యూహంలో చిక్కుకుని రోధిస్తున్నాడు.












