స్వలాభం కోసం కొందరు రెవెన్యూ అధికారులు, దుష్టశక్తులు కలిసి రైతులకు మాయమాటలు చెప్పి, వారి భూములను పంజాబ్ కంపెనీకి అప్పజెప్పారని, నిషేధిత జాబితాలో చేర్చి రైతుబంధు వంటి పథకాలకు దూరం చేశారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆరోపించారు. మండలంలోని రామ్ టెక్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
అప్పట్లో రెవెన్యూ అధికారుల తప్పిదాలు నియోజకవర్గంలో వేలాది మంది రైతులకు శాపంగా మారాయని, వారి నిర్లక్ష్యం మూలంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని రామ్ టెక్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన మాట్లాడారు. అప్పట్లో కొందరు దుష్టశక్తులు వారి స్వలాభం కోసం రైతులకు మాయమాటలు చెప్పి, నియోజకవర్గంలో వందలాది ఎకరాల రైతుల భూములను పంజాబ్ కంపెనీకి అప్పజెప్పడం జరిగిందన్నారు. ఇప్పటికీ వారు నియోజకవర్గంలో ఉన్నారని, వారి మాయమాటలతో రైతులకు కోట్లాది నష్టం జరిగిందని, ఇకనైనా మోసగాళ్ల మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. పంజాబ్ కంపెనీకి ఒక గ్రామంలో రైతు రెండు ఎకరాలు అమ్మితే, ఆ సర్వే నంబర్ లో ఉన్న భూములతో పాటు ఆ నంబర్ లోని మిగతా భూములను కూడా రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చి రైతుకు తీరని అన్యాయం చేశారని ఆయన తెలిపారు. తానూరు, మండలాల్లో వందలాది మంది రైతులు 15 సంవత్సరాలుగా తమ స్వంత భూమి ఉన్నప్పటికీ రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణం, ఇతర పథకాలకు నోచుకోలేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక కంటతడి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడి పాలకులు పట్టించుకోకపోవడంతో భూమిని నమ్ముకున్న రైతులకు అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. రామ్ టెక్ గ్రామంలో రైతులు పంజాబ్ కంపెనీకి 37 ఎకరాల 20 గుంటల భూమి అమ్మితే, ఆ సర్వే నంబర్ లోని మొత్తం 295 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా వెంకటాపూర్ గ్రామంలో 35 ఎకరాల భూమి అమ్మితే, ఆ సర్వే నంబర్ లోని 152 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చి 152 మంది రైతులకు ఇబ్బంది కలిగించారని ఆయన అన్నారు. ఈ లెక్కన రైతుబంధు పథకం రైతులకు అందక, రెండు గ్రామాలకు కలిపి రైతులు సుమారు 3 కోట్ల 60 లక్షల రూపాయలు నష్టపోయారని ఆయన తెలిపారు. ఇలా తానూర్ మండలంలో వేలాది ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉందని, రైతులు సుమారు 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయారని, అప్పటి పాలకులు, కొందరు దుష్టశక్తుల మూలంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. ఇకనైనా మేమున్నామంటూ మాయమాటలు చెప్పే వారిని దగ్గరకు రానివ్వద్దని ఆయన సూచించారు. తాను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడడంతో, ప్రభుత్వం బాధిత గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సభల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. రైతుకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు రామ్ టెక్ సర్పంచ్ గంగాధర్, సీనియర్ నాయకులు నర్సా గౌడ్ తో పాటు పలువురు మాట్లాడుతూ, సమస్యను తాము ఎమ్మెల్యే పటేల్ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సభల్లో ఆయా గ్రామాల సర్పంచులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.












