కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. వినియోగదారుల తరఫున పనులు పూర్తి చేసే ఏఐ ఏజెంట్, సిస్కో అధ్యక్షుడు జీతూ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను విశ్లేషించింది. దీని ద్వారా ఆయన ఏడాదికి సుమారు రూ.1.14 లక్షలు ఆదా చేయగలిగారు.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారాన్ని విశ్లేషించడం వంటి పనులకే పరిమితమైన ఏఐ.. ఇప్పుడు వినియోగదారుల తరఫున పనులు కూడా పూర్తి చేస్తోంది. దీనికి ఉదాహరణగా సిస్కో అధ్యక్షుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జీతూ పటేల్ అనుభవం నిలిచింది. తన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను పరిశీలించేందుకు ఏఐ ఏజెంట్‌కు అనుమతి ఇచ్చిన ఆయన, ఏడాదికి సుమారు 9,000 డాలర్లు (రూ.8.54 లక్షలు) వివిధ సబ్స్క్రిప్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అనవసరమైన సేవలను గుర్తించి రద్దు చేయడంతో ఏడాదికి 1,000 నుంచి 1,200 డాలర్లు (సుమారు రూ.95 వేల నుంచి రూ.1.14 లక్షల వరకు) ఆదా చేయగలిగారు.
ఈమెయిళ్లు పరిశీలించి ఖర్చుల లెక్కలు
జీతూ పటేల్ తన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను ఏఐ ఏజెంట్‌తో పరిశీలింపజేశారు. అందులోని చెల్లింపులు, పునరావృత సబ్స్క్రిప్షన్ల వివరాలను విశ్లేషించిన ఏజెంట్, ఏ సేవకు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంతకాలంగా ఆ చెల్లింపులు కొనసాగుతున్నాయి అనే వివరాలతో పట్టికను రూపొందించింది. ఆ వివరాలను పరిశీలించిన పటేల్, తనకు ఇక అవసరం లేని రెండు సబ్స్క్రిప్షన్లను గుర్తించారు. వాటిని రద్దు చేయాలని ఏజెంట్‌కు సూచించడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసి, రద్దుకు సంబంధించిన నిర్ధారణ ఈమెయిళ్లను కూడా పంపింది.
డ్రాప్బాక్స్లోనూ డూప్లికేట్ చెల్లింపు
ఈ పరిశీలనలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇప్పటికే రెండు టెరాబైట్ల నిల్వ సామర్థ్యం ఉన్న డ్రాప్‌బాక్స్ ప్లాన్ తీసుకున్నప్పటికీ, పొరపాటున మరో 11.95 డాలర్ల ప్లాన్‌కు కూడా ఆయన చెల్లిస్తున్నట్లు ఏజెంట్ గుర్తించింది. ఈ అదనపు చెల్లింపును కూడా రద్దు చేయడంతో అనవసర ఖర్చు తగ్గింది.
ఏఐ ఏజెంట్ ఇంత సులభంగా ఈ పనులను పూర్తి చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పటేల్ పేర్కొన్నారు. నెలకు 20 డాలర్లు (సుమారు రూ.1,900) ఖర్చయ్యే ఏఐ సేవతోనే ఏడాదికి దాని ధరకు పలుమార్లు సమానమైన మొత్తాన్ని ఆదా చేయగలిగానని తెలిపారు.
ఒకే ఏఐపై ఆధారపడటం లేదు
తాను ఒకే ఏఐ సాధనాన్ని ఉపయోగించడం లేదని, వివిధ పనుల కోసం నాలుగు నుంచి ఐదు వ్యక్తిగత ఏఐ ఏజెంట్లను వినియోగిస్తున్నానని జీతూ పటేల్ వెల్లడించారు. వార్తలను సేకరించడం, వాటి సారాంశాలను రూపొందించడం, కంపెనీల ఆర్థిక ఫలితాల సమావేశాలను విశ్లేషించడం, వ్యక్తిగత పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం వంటి అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
అయితే, వ్యక్తిగత ఏఐ ఏజెంట్లకు కార్యాలయానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం లేదా సున్నితమైన వ్యవస్థలకు అనుమతులు ఇవ్వకూడదని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించే సాధనాలకు, సంస్థలో అధికారికంగా అనుమతించిన సాధనాలకు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని సూచించారు.
చాలామంది వినియోగదారులు వీడియో, సంగీతం, క్లౌడ్ నిల్వ, వార్తలు, ఇతర డిజిటల్ సేవల కోసం నెలవారీ లేదా వార్షిక చందాలు చెల్లిస్తుంటారు. కాలక్రమంలో అవసరం లేని సేవలను రద్దు చేయకపోవడం, ఒకే తరహా సేవలకు రెండుసార్లు చెల్లించడం వల్ల ఖర్చులు పెరుగుతుంటాయి. ఇలాంటి చెల్లింపులను గుర్తించడంలో ఏఐ ఏజెంట్లు ఉపయోగపడవచ్చని జీతూ పటేల్ అనుభవం సూచిస్తోంది.












