గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు, వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్య లెక్కింపు వంటి అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. చేపట్టే పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పనులు నాణ్యవంతంగా ఉండాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తుల రద్దీ మేరకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి వసతి కల్పించాలని సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం, పుష్కరాల కోసం బాసరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యుఎస్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, సందీప్, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












