సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఎస్పీ ఆర్మూర్ అసెంబ్లీ నాయకులు ఏరోళ్ల ప్రేమ్ కుమార్ ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయించి, వేధించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు.
ఆర్మూర్: సమాజంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని బీఎస్పీ ఆర్మూర్ అసెంబ్లీ నాయకులు ఏరోళ్ల ప్రేమ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయించి, పైశాచికంగా వేధించడం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం, మండలం తాడెం గ్రామంలో ఉపాధి హామీ పనులలో జరిగిన అవినీతిని బయటపెట్టిన జర్నలిస్ట్ బస్వరాజుపై అక్రమ కేసులు బనాయించి, పోలీస్ స్టేషన్కు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రాచరిక పాలనను తలపిస్తోందని ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకుల తప్పులను కప్పిపుచ్చుతూ, అణగారిన వర్గాల గొంతుకలను అణచివేయాలని చూసే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలవక తప్పదని ఆయన స్పష్టం చేశారు.











