జిల్లా కలెక్టరేట్లో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అధికారులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు నిజాం వ్యతిరేక పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహనీయుడిగా ఆయన సేవలు గర్వించదగినవని పేర్కొన్నారు. వృద్ధాప్యంలోనూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు. సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆయన వంటి మహనీయుల చరిత్రను పరిచయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి సేవలను నేటి తరానికి తెలియజేయడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, వివిధ కుల సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











