దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం కల్పించాలని, వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. బీసీల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చట్టం తీసుకురావాలని కోరింది.
స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉండటమే కాకుండా, ఆశించిన స్థాయిలో ఎదగకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, బీసీలపై జరుగుతున్న అగ్రవర్ణ దాడులను ఖండించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేసి, బీసీలపై దాడులు జరగకుండా బీసీ రక్షణ చట్టాన్ని దేశమంతటా విస్తరించాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
రిజర్వేషన్లపై డిమాండ్
దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ ప్రజలు అతి తక్కువ శాతం రాజ్యాధికారాన్ని పొందుతున్నందున, స్థానిక సంస్థలతో పాటు చట్టసభలలో బీసీలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూడటంతో పాటు, విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా ఇదే దామాషా పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగేలా తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఆందోళన తీవ్రతరం హెచ్చరిక
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, లేనిచో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఉప సర్పంచ్ల మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, హుజురాబాద్ బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉపాధ్యక్షులు కొలిపాక క్రాంతి కుమార్, మాము నూరి ప్రవీణ్ కుమార్, తాళ్లపల్లి రమేష్, మంచి కట్ల మురళి, చిలుక మారి శ్రీనివాస్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజక వర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియ దర్శిని, మంద బిక్షపతి (కె.ఆర్), కానుగంటి శ్రీనివాస్, గోస్కుల మధుకర్, గరవేనా శ్రీకాంత్, కన్నెబోయిన రాజయ్య, దాసరి మల్లేశం, పిల్లి రాజు, రావుల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.












