దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను వాహనదారులు తప్పనిసరిగా చెల్లించేలా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ-చలాన్ల బకాయిలు ఉన్న వాహనాలకు సంబంధించిన పలు ఆన్లైన్, రవాణా సేవలను నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, బకాయి చలాన్లు పూర్తిగా చెల్లించే వరకు వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ, యజమాని చిరునామా మార్పు, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి సేవలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. పెండింగ్ ఈ-చలాన్లు ఉన్న వాహనాలను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో ఆ వాహనాల విక్రయం లేదా యాజమాన్య బదిలీకి అవకాశం ఉండదు.
అదేవిధంగా, బకాయి చలాన్లు ఉన్న వాహనాలకు పీయూసీ (కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ) సర్టిఫికెట్ జారీ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఒక వాహనంపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైన సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న లైసెన్స్‌ను సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
చలాన్ల బకాయిలు రూ.49 వేల కోట్లకు పైగా
ఈ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ-చలాన్ల రూపంలో సుమారు రూ.49,194.05 కోట్లు వసూలు కావాల్సి ఉందని కోర్టుకు వివరించారు. ఇప్పటివరకు సుమారు రూ.26,175.05 కోట్లు వసూలైనట్లు సమాచారం అందింది. కేవలం పెద్ద సంఖ్యలో చలాన్లు జారీ చేయడం కాకుండా, వాటి వసూళ్లకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహించాలని, చలాన్లు జారీ అయినప్పటికీ వాటిని చెల్లించకుండా ఉన్నట్లు గుర్తిస్తే, అవసరమైన సందర్భాల్లో వాహనాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
సాంకేతిక ఆధారిత ట్రాఫిక్ నిఘా వ్యవస్థ
రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, స్పీడ్ గన్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించే విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతాలను గుర్తించి, అవసరమైన పరికరాల కొనుగోలు, ఏర్పాటు, నిర్వహణను పూర్తి చేయాలని సూచించింది.
ఈ ఆదేశాలు 2024, న జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా ఉన్నాయి. దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న రహదారి భద్రతకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ చర్యలు సూచించారు.












