మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన పశువైద్య విద్యార్థికి పురస్కారం అందజేశారు. రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ, పశువైద్య కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా, వెంకంపల్లి గ్రామానికి చెందిన చిల్కూరి రవీందర్రెడ్డి కుమారుడు చిల్కూరి మనీష్రెడ్డిని సన్మానించారు.
పశువైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న మనీష్రెడ్డి విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మనీష్రెడ్డిని అభినందించిన మంత్రి, విద్యార్థులు విద్యతో పాటు తమ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని సమాజానికి సేవ చేయాలని సూచించారు.
మనీష్రెడ్డికి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడంపై మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డితో పాటు వెంకంపల్లి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.












