ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు, డీజిల్ ధరలను అదుపు చేసేందుకు జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అత్యవసర నిల్వల నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, ఇంధన ఉత్పత్తులను విడుదల చేయడానికి అంగీకరించాయి. ఈ ప్రక్రియను అంతర్జాతీయ ఇంధన సంస్థ సమన్వయం చేయనుంది.
నాలుగు నెలల వ్యవధిలో ఈ నిల్వలను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇందులో తొలి 20 రోజుల్లోనే గణనీయమైన పరిమాణంలో డీజిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. అమెరికాలో డీజిల్ ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఇంధన ధరల పెరుగుదలపై ఒత్తిడి పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యూరప్ వద్ద ఉన్న డీజిల్ నిల్వలను విడుదల చేయాలని కోరారు. జీ7 నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ, యూరప్ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ మార్కెట్లోకి వస్తుందని తెలిపారు.
జీ7 సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించారు. ఇంధన మార్కెట్లలో స్థిరత్వం తీసుకురావడంతో పాటు వినియోగదారులు, పరిశ్రమలపై పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీ7 నాయకుల ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో జీ7 దేశాల మధ్య ఇంధనం, ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించకుండా ఉండాలని కూడా నిర్ణయించారు. మార్కెట్లో కొరత, ధరల ఒత్తిడి మరింత పెరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు జీ7 తెలిపింది.
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని డీజిల్ నిల్వలను విడుదల చేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు వెల్లడించింది. అత్యవసర నిల్వల నుంచి చమురు విడుదలతో అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా పెరిగి ధరలపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే విడుదలయ్యే చమురు, డీజిల్ పరిమాణం దేశాల వారీగా ఎంత అన్న పూర్తి వివరాలను జీ7 ఇంకా వెల్లడించలేదు.












