లోకేశ్వరం, 10 September
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు.
ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేయబోయి ఉపాధ్యాయుడి మృతి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేయబోయి కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలం మన్మధ గ్రామానికి చెందిన పైడిపల్లి భోజన్న (48) నిర్మల్ పట్టణంలో నివాసం ఉంటూ కంజర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన స్నేహితుడు విదేశాలకు వెళ్లడంతో బుధవారం రాత్రి మరో ముగ్గురితో కలిసి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. స్నేహితుడిని విమానాశ్రయంలో దింపిన అనంతరం గురువారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. డిచ్పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో కారు డ్రైవర్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చున్న భోజన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. కారులో ఉన్న మరో ముగ్గురు గాయాలతో బయటపడినట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












