చాకలి ఐలమ్మకు ఘన నివాళి
చాకలి ఐలమ్మకు ఘన నివాళి గుంటూరు, సెప్టెంబరు 10: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, అమరవీరురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నవమి లాం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ ప్రధాన కార్యదర్శి నవమి లాం, ఆమె అనుచరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం నాటి నిజాం పాలకులు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. తన భూమి, పంటను దోచుకునేందుకు ప్రయత్నించిన భూస్వాములను ఎదిరించి తన హక్కుల కోసం నిలబడిన ధీర వనితగా ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. వెట్టి చాకిరీ, దొరల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటానికి ఐలమ్మ అందించిన స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. మహిళల్లో ధైర్యం, ఆత్మగౌరవం పెంపొందించేందుకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ త్యాగం, పోరాట పటిమ తరతరాలకు ఆదర్శమని, ఆమె ఆశయాలను కొనసాగించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.











