వేములవాడ, 15 November
కార్తీక మాసం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహస్రదీపోత్సవం వైభవంగా జరుగుతోంది. సర్దేశాయి గడి ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రముఖ ప్రవచన కర్త నమిలకొండ సునీత గారి ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కార్తీక మాసం పురస్కరించుకొని వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సహస్రదీపోత్సవం కార్యక్రమం సర్దేశాయి గడి ఆవరణలో కన్నుల పండువగా జరుగుతోంది. దీపోత్సవ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ప్రముఖ ప్రవచన కర్త, వేములవాడ ఆడబిడ్డ అయిన శ్రీమతి నమిలకొండ సునీత గారి అద్భుత ప్రవచనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో సప్త హారతుల ఘట్టంతో భక్తులు చప్పట్లు కొడుతూ శివనామస్మరణలో మైమరచిపోయారు.
ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం వరకు ఉంటుందని, ప్రతిరోజూ సాయంత్రం అభిషేకం, ప్రముఖుల ప్రవచనాలు, సప్త హారతులు, దీప అలంకరణ ఉంటాయని తెలిపారు. కార్తీక పౌర్ణమి నాడు, 24వ తేదీన శివ కళ్యాణం, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, ట్రస్ట్ చైర్మన్ రాగంపేట హరిబాబు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రాంగణమంతా దైవనామస్మరణతో మారుమోగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు.






