కుబీర్, 13 November
నిర్మల్ జిల్లా మహాగా గ్రామంలో రోడ్డుపై పశువుల మకాం బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి తీసుకొచ్చే సమయంలో రహదారిపైనే గుంపులుగా నడుస్తూ బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
నిర్మల్ జిల్లా మహాగా గ్రామంలో ఆర్టీసీ బస్సు భైంసా నుండి పార్డి (బి)కు వెళ్లే మార్గంలో రోడ్డుపై పశువుల మకాం బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో, తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చే సమయంలో రహదారిపైనే పశువులు గుంపులుగా నడుస్తుండటంతో ఈ సమస్య తలెత్తుతోంది.
ముఖ్యంగా బస్సులు ఎదురుగా వస్తున్నప్పటికీ పశువులను రోడ్డుకు ఒకవైపునకు తప్పించకుండా కాపరులు పట్టించుకోకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. బస్సు వెనుక వాహనాలు నిలిచిపోతున్నా, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా కాపరులు మాత్రం పశువులను పక్కకు జరపకుండా రోడ్డుపైనే నిలబడి చూస్తుండటం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోజూ ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. పశువులను రోడ్డు పక్కనుండి తీసుకెళ్లేలా కాపరులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






