వేములవాడలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్రదీపోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. సర్దేశాయి గడి ఆవరణలో కన్నుల పండువగా జరుగుతున్న ఈ దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపాల వెలుగులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివనామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ నోరి నారాయణమూర్తి అందించిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. భక్తి, ధర్మం, ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆయన ప్రవచనాలను భక్తులు ఆసక్తిగా ఆలకించారు. అనంతరం నిర్వహించిన సప్తహారతుల ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హారతుల సమయంలో భక్తులు చప్పట్లు కొడుతూ, శివనామస్మరణలో మైమరచిపోయారు. దీపాల కాంతులు, భక్తుల హరహర మహాదేవ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది.
ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సహస్రదీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం అభిషేకాలు, ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలు, సప్తహారతులు, ప్రత్యేక దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా శివకల్యాణం, జ్వాలాతోరణం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ రాగంపేట హరిబాబు తెలిపారు. కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పేలా, భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తులందరూ కుటుంబ సమేతంగా సహస్రదీపోత్సవ కార్యక్రమాలకు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ట్రస్ట్ చైర్మన్ రాగంపేట హరిబాబు కోరారు. కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలు భక్తులకు భక్తిభావాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి.






