కామారెడ్డి జిల్లా లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పత్రిక ఇవ్వడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చిన యువతి, తెల్లవారుజామున సెల్ టవర్ వద్ద విగతజీవిగా కనిపించింది. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మండలంలోని అంగడి బజార్ సెల్ టవర్ వద్ద నివాసముండే సిక్కు మతానికి చెందిన ఆర్తి కౌర్ (19), జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధం కుదరగా, అమ్మమ్మ ఇంటికి పెళ్లి పత్రిక ఇవ్వడానికి కి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆర్తి కౌర్ తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఆమె కనిపించకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో సెల్ టవర్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది.
కొన్ని రోజుల క్రితం వరకు పెళ్లి సంబరాలతో కళకళలాడిన ఇల్లు, ఇప్పుడు ఆర్తి కౌర్ మృతితో తీరని దుఃఖంలో మునిగిపోయింది. కొత్త జీవితం ప్రారంభించాల్సిన వయసులోనే ఆమె ఇలా దూరం కావడం బంధువులను, గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. పెళ్లి సంతోషంలో ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్, సదాశివనగర్ సీఐ వీరయ్య, సీఐ సంతోష్ కుమార్, ఎస్సై మహేందర్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.












