రాజస్థాన్‌లోని జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఒక మహిళా అభ్యర్థి వినూత్న హామీతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చే బాధ్యత తనదేనని, అవసరమైతే ఇతర గ్రామాలకు వెళ్లి పెళ్లికూతుళ్లను వెతికిస్తానని అనితా సైని ప్రకటించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి హామీలు ఇస్తుంటారు. అయితే, రాజస్థాన్‌లోని జిల్లాకు చెందిన ఝాఝర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనితా సైని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే సరికొత్త హామీతో ఓటర్ల ముందుకు వచ్చారు. ఆమె చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో సాధారణ అభివృద్ధి హామీలకు భిన్నంగా ఆమె ఇచ్చిన ఈ హామీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనితా సైని మాట్లాడుతూ, తాను ఎన్నికల్లో గెలిచి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గ్రామంలో పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో తగినన్ని వధువులు దొరకని పరిస్థితి ఎదురైతే, అవసరమైతే ఇతర గ్రామాలకు వెళ్లి పెళ్లికూతుళ్లను వెతికిస్తానని, యువకులకు తగిన జీవిత భాగస్వాములను గుర్తించి ఘనంగా వివాహాలు జరిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడని ఈ పెళ్లి అంశాన్ని ఆమె తన ప్రధాన ఎన్నికల అజెండాలో చేర్చడం విశేషం.
అంతేకాకుండా, తన వినూత్న హామీలకు మరింత పదును పెడుతూ, పెళ్లికాని యువకులకు వివాహం కుదిరిన తర్వాత పెళ్లి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నిస్తానని అనితా సైని తెలిపారు. ఈ విచిత్రమైన, ఆసక్తికరమైన వాగ్దానం గ్రామంలోని యువతను, ముఖ్యంగా పెళ్లికాని బ్రహ్మచారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయ రాజకీయ హామీలకు భిన్నంగా, నేరుగా యువకుల వ్యక్తిగత సమస్యను ప్రస్తావిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు స్థానికంగా నవ్వులు పూయిస్తూనే, మరోవైపు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి అసమతుల్యత కారణంగా యువకులు వివాహాలు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువస్తున్నట్లు గతంలో నివేదికలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, పెళ్లికాని యువకులకు పెళ్లిళ్లు చేయిస్తానంటూ ఒక మహిళా సర్పంచ్ అభ్యర్థి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ వినూత్న హామీని ఆమె ఎన్నికల్లో గెలిచాక ఎలా అమలు చేస్తారు పెళ్లికాని యువకులకు సంబంధాలు కుదిర్చేందుకు ఎలాంటి అధికారిక లేదా సామాజిక చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మన రాష్ట్రంలో కూడా రేపు మాపో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా యువకుల కోసం ఇలాంటి మెగా ఆఫర్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి వాగ్దానం ఇచ్చి గెలిచిన తర్వాత నెరవేరిస్తే యువకులంతా సంతోష పడతారు. అసలే మ్యారేజ్ బ్రోకర్లతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. ఒకప్పుడు వధువు, వరుడు ఇద్దరూ ఇష్టపడిన తర్వాత వరుడి ఆస్తిపాస్తులను చూసేవారు. ఇప్పుడు వధువు తరఫు మనుషులు బ్రోకర్లను అడుగుతారో లేదో తెలియదు కానీ, వారు మాత్రం మీకు నెలకి జీతం ఎంత ఆస్తికి సంబంధించి పత్రాలు ఎవరి మీద ఉన్నాయి ఇలా సవాలక్ష ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని చెప్పే అభ్యర్థులు ఇలాంటి మంచి పనులకు నిజంగా పూనుకుంటే సంతోషించే విషయమే. కానీ, ఓట్ల కోసం ఇలాంటి తంత్రాన్ని కూడా ఇకమీదట ఉపయోగిస్తారేమో












