తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, పెత్తరమాస సందర్భంగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శనివారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు బియ్యమిచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. మన గ్రామీణ సంప్రదాయంలో పెత్తరమాస రోజున పెద్దలకు బియ్యం ఇచ్చి, పూర్వీకులను స్మరించుకోవడం ఒక ఆచారమని అన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారు ఏ ఆశయాల సాధన కోసం ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలను నెరవేర్చేందుకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అమరవీరులు కలలుగన్న సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమగ్ర తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం నివాళులకే పరిమితం కాకుండా, వారి ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు, శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. నీరుడి స్వామి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












