కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 69 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్న వార్షికోత్సవాలు, కల్లుగీత వృత్తి ఆధునీకరణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గౌడలకు, గీత కార్మికులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు సింగం సత్తయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన 37,381 మంది గీత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. వృత్తి నిర్వహణలో ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు గీత కార్మికులందరికీ కంఠమయ్య రక్షణ కవచాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించాలని, కల్లుగీత వృత్తిలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన హామీలను ఆచరణలో అమలు చేయాలని ఆయన అన్నారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని, జిల్లా కేంద్రాల్లో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల తయారీ, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల పింఛన్‌ను రూ.4 వేలకు, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గీత కార్మిక సహకార సంఘాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వృత్తి ఆధునీకరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు సొసైటీల అధ్యక్షులు, టీఎఫ్టీ బాధ్యులు, గౌడ సంఘాల నాయకులు, గీత కార్మికులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బెల్లంకొండ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.
గీత కార్మికుల సమస్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సింగం సత్తయ్య గౌడ్ తెలిపారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. గీత కార్మికుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం, సంఘం 69వ వార్షికోత్సవాలు, రాష్ట్ర సదస్సుకు సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లును సింగం సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో కుక్కలగూడూరు గ్రామ గీత కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలోని కల్లు మండువాలో అక్రమంగా ఏర్పాటు చేసిన మద్యం బెల్ట్‌షాపు కారణంగా గ్రామానికి చెందిన సుమారు 150 మంది గీత కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని గ్రామ గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు మండువాలో బెల్ట్‌షాపు ఏర్పాటు చేయడంతో తమ వృత్తికి గండిపడిందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు. గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపును తక్షణమే తొలగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీని కుక్కలగూడూరు గ్రామ గీత కార్మికులు కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని సాంబయ్య, మండల నాయకులు కోల రామ్మూర్తి గౌడ్, పొన్నం అంజయ్య గౌడ్, శ్రీపతి తిరుపతి, ముక్కెర పోశయ్య, సింగం బుచ్చన్న, నేరెళ్ల రామయ్య, బొమ్మగాని కొండయ్య, పల్లె శ్రీను, ప్రభాకర్, నేరెళ్ల రాజగౌడ్, పల్లె సత్తయ్య, మహేష్, బైరు లచ్చయ్య, ఆరేళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.








