నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను , ప్రాక్టికల్ శిక్షణతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చినప్పుడే వారి సామర్థ్యాలు పెరుగుతాయని, తద్వారా వారు మంచి వైద్యులుగా తీర్చిదిద్దబడతారని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. వైద్య కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, వారి విద్యా సంబంధిత విషయాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నిర్దేశిత పరీక్షలను నిర్వహిస్తూ, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లో అవసరమైన వైద్య సేవలను అందించేందుకు కావలసిన పరికరాలన్నీ ప్రాధాన్యత క్రమంలో సమకూర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, డిసిహెచ్ఓ కాశీనాథ్, ఇతర అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.












