కమలాపూర్ పాఠశాలలో వారం రోజులపాటు మధ్యాహ్న భోజనం వండించకుండా నిలిపివేసిన వ్యవహారంలో హెడ్మాస్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారంలో మండల విద్యాధికారి (ఎంఈఓ) నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై వివరణ కోరుతూ విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
గత నెల 15 నుంచి 22వ తేదీ వరకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండించకుండా నిలిపివేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. అసిస్టెంట్ కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి, అందిన నివేదిక ఆధారంగా హెడ్మాస్టర్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఆర్సీ 2972/బీ1/2026, తేదీ 13-10-2026న ఉత్తర్వులు జారీ చేసినట్లు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ప్రతినిధులు తెలిపారు.
అదే సమయంలో మధ్యాహ్న భోజనం వారం రోజులపాటు నిలిచిపోయినప్పటికీ సంబంధిత అంశంపై తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఎంఈఓకు కూడా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆర్సీ 2972/బీ1/బీ5/2026, తేదీ 13-10-2026 ద్వారా నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.
ఉత్తర్వులు వెలువడటంలో జాప్యంపై ఫిర్యాదు
ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ఈ నెల 12న జిల్లా కలెక్టర్‌కు ప్రాతినిధ్యం చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. మరుసటి రోజే సస్పెన్షన్, షోకాజ్ నోటీసులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, అవి ఈరోజు వరకు బహిర్గతం కాకుండా విద్యాశాఖలోనే నిలిచిపోయాయని ఆరోపించారు.
చర్యలకు సంబంధించిన ఫైలు ఎక్కడ ఉందనే విషయమై కలెక్టర్ కార్యాలయ పేషీలో విచారించగా తమ వద్ద విద్యాశాఖకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో లేవని సీసీ రాము తెలిపినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు. అనంతరం విద్యాశాఖ సిబ్బందిని ఫోన్లో సంప్రదించగా ఫైలు తమ వద్దకు రాలేదని చెప్పారని, కొద్దిసేపటికే తిరిగి ఫోన్ చేసి ఫైలు వచ్చిందని, సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని సమాచారం ఇచ్చారని తెలిపారు.
కలెక్టర్‌కు సంబంధించిన సస్పెన్షన్, షోకాజ్ నోటీసుల ఫైలు పది రోజులపాటు ఎక్కడ నిలిచిపోయిందనే అంశంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ వాటి అమలులో జాప్యానికి బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ఒమాజీ పాల్గొన్నారు.








