దసరా, దీపావళి పండుగల సందర్భంగా నిజమాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు ట్రాఫిక్ సహాయ కమిషనర్ మస్తాన్ అలీ తెలిపారు. ప్రజలు సురక్షితంగా షాపింగ్ చేసుకుని, క్షేమంగా ఇళ్లకు చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
బంగారు ఆభరణాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దొంగల దృష్టి బంగారంపై ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళలు షాపింగ్‌కు వచ్చేటప్పుడు బంగారు ఆభరణాలకు బదులుగా రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ధరించాలని సూచించారు. షాపింగ్ సమయంలో ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు దుకాణాల వద్ద వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని వ్యాపారులకు సూచించారు. ప్రతి దుకాణంలో ఉన్న భూగర్భ వాహన నిలుపుదల ప్రదేశాలను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, పాలిటెక్నిక్, పారిశ్రామిక శిక్షణ సంస్థ తదితర ప్రాంతాల్లో వాహనాలను ఉచితంగా నిలిపి షాపింగ్ చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. రంజాన్, గణేశ్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగినట్లే దసరా, దీపావళి పండుగలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకునేలా చర్యలు చేపడుతున్నామని మస్తాన్ అలీ తెలిపారు. మోసాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని, ఆకతాయిలను గుర్తించి కట్టడి చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.












