జిల్లా కేంద్రంలో షాపింగ్ మాల్స్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ వసతుల కొరతపై మనోరంజని తెలుగు టైమ్స్ దినపత్రికలో ప్రచురించిన కథనం అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఈ కథనం వెలువడిన అనంతరం టౌన్ పోలీసులు స్పందించి, పలు షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.
పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ వద్ద వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని మనోరంజని తెలుగు టైమ్స్ తన కథనం ద్వారా స్పష్టంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
వార్తకు స్పందన.. మాల్స్‌కు నోటీసులు
ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు, భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకున్న టౌన్ పోలీసులు, పట్టణంలోని కిషన్ షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, మాంగల్య షాపింగ్ మాల్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఆనంద్ షాపింగ్ మాల్ తదితర షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.
అధికారుల దృష్టికి ప్రజా సమస్య
ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను గుర్తించి, వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మనోరంజని తెలుగు టైమ్స్ తనదైన ముద్ర వేస్తోంది. ఈ కథనం ప్రచురితమైన కొద్ది సమయంలోనే పోలీస్ శాఖ స్పందించి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
వార్తా ప్రభావానికి నిదర్శనం
వార్త ప్రచురణ.. అధికారుల స్పందన.. చర్యలకు శ్రీకారం అన్నట్లుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మనోరంజని తెలుగు టైమ్స్ కథనానికి వచ్చిన స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు తక్షణమే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలనే దిశగా ఈ పరిణామం స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.
ప్రజల గొంతుకగా.. సమస్యలపై ప్రశ్నించే అక్షరంగా.. అధికారుల దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లే బాధ్యతాయుత పత్రికగా మనోరంజని తెలుగు టైమ్స్ ముందుకు సాగుతోందనడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.


