మణుగూరు కాట సమీపంలోని ప్రధాన రహదారిపై లారీలను నిలిపివేయడం, బొగ్గు ధూళి పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా, దుమ్ము కారణంగా ప్రమాదాల భయం నెలకొంది. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు కాట వద్ద ప్రధాన రహదారిపై లారీలను ఇరువైపులా నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, బొగ్గు ధూళి గాలిలో కలిసిపోయి దుమ్ము మేఘంలా రహదారిని కమ్మేస్తోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుమ్ము కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం నెలకొంది. రహదారి వెడల్పు తగ్గిపోవడంతో అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పార్కింగ్ స్థలం ఉన్నా రోడ్డుపైనే లారీలు
లారీల పార్కింగ్ కోసం సింగరేణి యాజమాన్యం ఓల్డ్ స్టోర్ ప్రాంతంలో ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ప్రధాన రహదారిపైనే లారీలను నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక పార్కింగ్ స్థలం ఉన్నప్పుడు రహదారిని పార్కింగ్ స్థలంగా మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి సెక్యూరిటీ, పోలీస్ శాఖలు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పు
రోడ్డుపై పేరుకుపోయిన బొగ్గు ధూళి, మట్టి, దుమ్ము వాహనాల రాకపోకలతో గాలిలో కలిసిపోయి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను కేవలం ట్రాఫిక్ సమస్యగా కాకుండా, ప్రజారోగ్యం, రహదారి భద్రతకు సంబంధించిన అత్యవసర సమస్యగా అధికారులు పరిగణించాల్సిన అవసరం ఉంది.
ప్రజావాణిలో వినతిపత్రం
ఈ నేపథ్యంలో, సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు కర్నే బాబురావు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మణుగూరు కు వినతిపత్రం సమర్పించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రహదారిపై క్రమం తప్పకుండా నీటిని చల్లి దుమ్ము ఎగరకుండా చూడాలని, పేరుకుపోయిన దుమ్ము, మట్టిని యంత్రాలతో తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
రహదారికి ఇరువైపులా లారీలను ఇష్టానుసారంగా నిలిపివేయకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఓల్డ్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, పోలీస్, ట్రాఫిక్, సింగరేణి యాజమాన్యం, సెక్యూరిటీ అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అత్యవసర వాహనాలకు నిర్బంధ రహిత మార్గం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.












