జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సదుద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచారని, ఆయన చూపిన మార్గం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
బీజేపీ కేంద్ర నాయకత్వం గాంధీజీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
గాంధీజీ ఆశయాలను కాపాడుతూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.












