జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుదర్శన్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు హాల్లో నిద్రిస్తున్న శోభ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు.
మహిళ ప్రతిఘటించి కేకలు వేయడానికి ప్రయత్నించడంతో దుండగులు ఆమె కళ్లలో కారం చల్లారు. అనంతరం అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కుమార్తెను బెదిరించి, మహిళ మెడలోని సుమారు ఐదు తులాల బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దుండగులు చోరీకి పాల్పడటంతో కల్కి నగర్ కాలనీలో కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కాలనీలో భద్రతను పెంచాలని కోరుతున్నారు.












