నగరంలోని ఎస్ఆర్ నగర్ పరిధిలో గోకుల్ ప్రైడ్ వసతి గృహంలో మహిళ హత్యకు గురైన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మృతురాలు శిరీష, నిందితుడు ఏ. శ్రీనివాస్ గతంలోనే ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నట్లు వెల్లడైంది.
వికారాబాద్ జిల్లాకు చెందిన శిరీషకు 2013లో వివాహం జరిగిందని, కుటుంబ కలహాల నేపథ్యంలో 2016లో భర్తతో విడాకులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తల్లిదండ్రుల వద్ద ఉంటూ బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో మండలం ఓగ్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో శిరీషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
పెద్దలు తమ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి వసతి గృహాల్లో కొంత సమయం గడిపి, తిరిగి వెళ్లేవారని పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో న దుర్గ, గణేష్ అనే పేర్లతో ఎస్ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ వసతి గృహంలో గది తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో టీవీ శబ్దాన్ని పెంచి, తెర కడ్డీతో శిరీష తలపై కొట్టి శ్రీనివాస్ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మరుసటి రోజు శ్రీనివాస్ వసతి గృహం నుంచి వెళ్లిపోయే సమయంలో శిరీష అల్పాహారం చేసిన అనంతరం గది నుంచి బయటకు వస్తుందని సిబ్బందికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
అయితే శిరీష ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వసతి గృహ సిబ్బంది మరో తాళంతో గది తలుపు తెరిచి చూడగా మంచంపై ఆమె మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.












