నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో మొత్తం 5,811 గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు తెలిపారు. భక్తులు సంప్రదాయబద్ధంగా తొమ్మిది, పదకొండు రోజుల పాటు మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని మతాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని అన్నారు. నిమజ్జనం సందర్భంగా బాసర వంతెన వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాసర, ఉమ్మెడతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిమజ్జన ఏర్పాట్లను పటిష్ఠంగా చేపట్టినట్లు వెల్లడించారు.
వివిధ శాఖల సహకారం
గణేష్ ఉత్సవాల నిర్వహణలో సార్వజనిక గణేష్ మండళ్లు, గణేష్ విగ్రహ కమిటీలు, మసీదు కమిటీలు, అన్ని మతాల ప్రజలు పోలీసు శాఖకు సహకరించారని పోలీస్ కమిషనర్ తెలిపారు. అదేవిధంగా రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, అబ్కారీ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది తమ సేవలను అందించారని పేర్కొన్నారు. జాతీయ విద్యార్థి దళం, జాతీయ సేవా పథకం, గజ ఈతగాళ్లు కూడా నిమజ్జన కార్యక్రమాల్లో తమ సేవలను అందించారని తెలిపారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా వార్తా సేకరణ, సమాచార ప్రసారంలో సహకరించిన పత్రికా ప్రతినిధులు, ముద్రిత, దృశ్య మాధ్యమాల సిబ్బందికి కూడా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.












