యూపీఐ లావాదేవీలపై విధించే చార్జీలను తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్ యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రకటన విడుదల చేశారు.
పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ మాట్లాడుతూ, యూపీఐ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించినా అది విద్యార్థులు, చిరు వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూపీఐ చెల్లింపులు ప్రజల నిత్యజీవితంలో భాగంగా మారాయని, వాటిపై అదనపు చార్జీలు విధించే విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
ప్రజలకు సౌకర్యవంతమైన, అందుబాటులో ఉండే డిజిటల్ చెల్లింపువ్యవస్థను కొనసాగించాలని, యూపీఐ సేవలను లాభార్జనకు కాకుండా ప్రజా ప్రయోజనానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్‌ను పట్టించుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












