జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ముస్లిం మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. ప్రజల మధ్య సోదరభావం కొనసాగాలని, ఉత్సవాల సందర్భంగా అందరూ సహకరించుకోవాలని ఆమె సూచించారు.
జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ముస్లిం మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల మధ్య ఉన్న సోదరభావం, పరస్పర సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. ముస్లిం మత పెద్దలు తమ చిన్ననాటి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు. గతంలో గణేష్ ఉత్సవాల సమయంలో హిందూ సోదరులతో కలిసి పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకుంటూ, లో ప్రజల మధ్య ఉన్న స్నేహభావం, సోదరభావం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తమకు ఉన్న సూచనలు మరియు సమస్యలను మతపెద్దలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
వారి సూచనలు, అభ్యర్థనలను జిల్లా ఎస్పీ సానుకూలంగా విని, ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ తనకు సమానమేనని, ఎవరికైనా ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తనను సంప్రదించవచ్చని, వారి సమస్యలను విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్సవాలు, శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలందరి సహకారంతో జిల్లాలో శాంతి, సోదరభావం మరియు పరస్పర గౌరవంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తో పాటు డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












