నిర్మల్, 15 September
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల సూచించారు. మంగళవారం నిర్మల్లో ముస్లిం మత పెద్దలతో జరిగిన సమావేశంలో ఆమె ఈ మేరకు పిలుపునిచ్చారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల సూచించారు. ఈ మేరకు మంగళవారం నిర్మల్లో ముస్లిం మత పెద్దలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ప్రజల మధ్య కొనసాగుతున్న సోదరభావం, పరస్పర సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తమ చిన్ననాటి అనుభవాలను ఎస్పీతో పంచుకున్నారు. గతంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా హిందూ సోదరులతో కలిసి పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకున్నారు. నిర్మల్లో ప్రజల మధ్య ఉన్న స్నేహభావం, సోదరభావం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, తమకు ఉన్న సూచనలు, సమస్యలను మత పెద్దలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సూచనలు, అభ్యర్థనలను సానుకూలంగా విన్న ఎస్పీ, ఏదైనా సమస్య ఎదురైతే పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ తనకు సమానమేనని, ఎవరికైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తనను సంప్రదించవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని ఆమె తెలిపారు. ప్రజలందరి సహకారంతో నిర్మల్ జిల్లాలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకుందామని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిర్మల్ ఉప పోలీసు అధికారి శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

