వేములవాడ, 15 November
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత స్వామివారి నిజరూప దర్శనం లభించనుంది. ఈ నెల 15 నుంచి 20 వరకు చందనోత్సారణ, మహా సంప్రోక్షణ మహోత్సవాలు జరుగుతాయి.
జగిత్యాల జిల్లా మండలం ముత్యంపేటలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా స్వామివారి మూలమూర్తిపై పూస్తున్న చందనపు పొరలను తొలగించి, భక్తులకు నిజరూప దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు చందనోత్సారణ, మహా సంప్రోక్షణ మహోత్సవాలను నిర్వహించనున్నారు.
ఎన్నో ఏళ్లుగా చందనంతో అలంకరించిన రూపంలో దర్శనమిస్తున్న కొండగట్టు అంజన్నను అసలు రూపంలో చూసే అవకాశం భక్తులకు ఇప్పుడు రాబోతోంది. గత 60 సంవత్సరాలుగా మూలవిరాట్టుకు పూస్తున్న చందనాన్ని ప్రత్యేక పద్ధతిలో తొలగించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వామివారి నిజరూపం భక్తులకు కనువిందు చేయనుంది.
ముఖ్యమంత్రికి ఆహ్వానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో ఆహ్వానం అందించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులకు కూడా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. దీంతో కొండగట్టు అంజన్న మహోత్సవాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆరు దశాబ్దాల క్రితం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నవారికి మళ్లీ అదే దివ్యరూపాన్ని చూసే అవకాశం రానుంది. ఆ తర్వాత జన్మించిన భక్తులకు తొలిసారిగా అంజన్న నిజరూప దర్శనం చేసుకునే అరుదైన భాగ్యం దక్కనుంది. ఒకే జీవితకాలంలో రెండుసార్లు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడం మహాభాగ్యంగా భక్తులు భావిస్తున్నారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం కోసం కొండగట్టు అంజన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొండగట్టు అంజన్న స్వామివారి నిజరూప దర్శనం చందనం తొలగించిన తర్వాత సుమారు 40 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయస్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ అధికారులు కోరారు.






