శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలను అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, పూజిస్తున్నాం. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, మరొకటి శ్రీలంకలో ఉండగా, మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. ఈ 18 దివ్య క్షేత్రాల విశిష్టతను తెలుసుకుందాం.
అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి తొడ భాగం పడిన స్థలంగా ప్రతీతి.
కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురం అమ్మగా వెలగొందుతోంది. అమ్మవారి శరీరభాగమైన కంకాళం ఇక్కడ పడినట్లు చెబుతారు.












