ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, పూల బతుకమ్మలతో కోలాటాలు ఆడారు.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకలకు సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫిరోజ్ ఖాన్, సామాజిక కార్యకర్త ఏల్లుల సంతోష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రేవతి దీదీ మాట్లాడుతూ, రంగురంగుల పూలను ఐక్యంగా పేర్చి బతుకమ్మను అందంగా తీర్చిదిద్దినట్లే, సమాజంలో పౌరులంతా విబేధాలను విడనాడి ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని తెలిపారు.
ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి పరిరక్షణకు బతుకమ్మ వేడుకలు ప్రత్యక్ష నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రజాబాహుళ్యమంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆశ్రమ బ్రహ్మకుమారీలు, భక్తులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










