క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు అవగాహన, దిశానిర్దేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి, పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన వారికి ఉచిత చికిత్స నిరంతరాయంగా అందేలా చూడాలని, రోగులు మందులను క్రమం తప్పకుండా వినియోగించేలా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత పరిచయస్తుల్లో అవసరమైన స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు రోగులకు పోషక సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రాజేందర్ మాట్లాడుతూ, నిక్షయ్ మిత్రల ద్వారా టీబీ రోగులకు పోషకాహారం, సామాజిక సహకారం అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలను భాగస్వాములను చేయాలని సూచించారు. టీబీపై ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు. టీబీ లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించేలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులు సూచించారు. కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలిచి టీబీ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మండల ప్రత్యేక అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












