జిల్లా బాసరలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, వార్డు సభ్యుడు ఫారూక్, డీడబ్ల్యూవో వినూత్న జ్యోతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
డీడబ్ల్యూవో వినూత్న మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, బాలామృతం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా కొలిచి వారి ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రక్తహీనత నివారణకు ఐఎఫ్ఏ మాత్రలు అందించడంతో పాటు సమతుల ఆహారంపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
తొలి వెయ్యి రోజులు కీలకం
శిశువు పుట్టిన తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమని, ఈ కాలాన్ని సువర్ణ దినాలుగా గుర్తించి తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, చనుబాల ప్రాముఖ్యత, ఇంట్లో తయారుచేసే పౌష్టికాహారం వంటి అంశాలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. పోషకాహార లోపం లేని గ్రామాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సామూహిక శ్రీమంతాలు
కార్యక్రమంలో గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ముధోల్ ప్రాజెక్టు అధికారి రాజశ్రీ, పోషణ్ అభియాన్ సమన్వయకర్త రోజా, శైలజ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పోషకులు, గర్భిణులు పాల్గొన్నారు.












