మండల పరిధిలోని కమ్మదనం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై ఆయన స్పందించారు.
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండలంలోని కమ్మదనం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శారదతో సమావేశమై, విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులు, పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా స్పందించారు. వారం రోజుల్లోగా విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం నీటి ట్యాంకును ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
పాఠశాలలోని ఇతర సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్మగళ్ల రమేష్, వెలిజర్ల గ్రామ సర్పంచ్ ఆర్. బాబు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరణకర్, గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనునాయక్, ఎస్సీ విభాగం నేత జాంగారి రవి, కాంగ్రెస్ నేతలు మాధవులు యాదవ్, గణేష్ నాయక్, జాంగారి జంగయ్య, కుమార్ నాయక్, మేగ్య నాయక్, రాజు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.












