కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను, న్యాయస్థానాల ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నడుస్తున్న పాఠశాల, అనుమతి లేని వసతిగృహాన్ని వెంటనే సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల వినోద్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యం పాల్పడుతున్న చట్ట ఉల్లంఘనలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో ఎస్పీఆర్ బ్రాండ్ పేరును ఉపయోగించకూడదని రంగారెడ్డి జిల్లా వాణిజ్య న్యాయస్థానం 11.08.2025 నాటి సి.ఓ.ఎస్. నెం. 21/2024 (ఐ.ఏ. నెం. 292/2024) ఉత్తర్వుల ద్వారా శాశ్వత నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినప్పటికీ, పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్‌జేడీఎస్‌ఈ) హైదరాబాద్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ఆర్.సి. నెం. 3668/ఏ2/2025 (తేదీ: 21.07.2026 01.08.2026) ప్రకారం సదరు పేరును తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యం వాటిని బేఖాతరు చేస్తోందని వారు మండిపడ్డారు. అంతేకాకుండా, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం 04.05.2026 నాటి డబ్ల్యూ.పి. నెం. 12250/2026 తీర్పును సైతం ధిక్కరిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పాఠశాలల గుర్తింపు మరియు నిర్వహణకు సంబంధించిన జీవో నంబర్ 1 మరియు జీవో నంబర్ 91 నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ముందస్తు అనుమతి, గుర్తింపు లేకుండా కొత్త పేరుతో తరగతులు నడపడం గానీ, ప్రవేశాలు (అడ్మిషన్లు) చేపట్టడం గానీ పూర్తిగా చట్టవిరుద్ధమని వారు స్పష్టం చేశారు. నీరు-భూమి-చెట్ల పరిరక్షణ చట్టం (వాల్టా చట్టం, 2002) నిబంధనలను కాలరాస్తూ, చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్) మరియు పరిసర రక్షణ ప్రాంతంలో (బఫర్ జోన్) పాఠశాల భవనాన్ని నిర్మించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ యాక్ట్, 2009) నిబంధనలకు విరుద్ధంగా, అగ్నిమాపక శాఖ అనుమతులు (ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ), భవన పటిష్టత ధ్రువీకరణ పత్రాలు లేకుండా అక్రమంగా వసతిగృహం నిర్వహిస్తూ వందలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. గతంలోనే జిల్లా కలెక్టర్ 03.08.2026 నాడు స్వయంగా డి.ఇ.ఓ - ఎంక్వయిర్ టేక్ యాక్షన్ అని లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అలాగే 24.09.2026 నాడు చట్టబద్ధమైన నోటీసు అందజేసినా, జిల్లా విద్యాశాఖ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లోతైన లోపాలు, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు ఆరోపించారు. ఈ సమగ్ర వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్, విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారికి అధికారిక ఎండార్స్మెంట్ ఆదేశాలు (డి.ఇ.ఓ, నల్గొండ - తేదీ: 28.09.2026) జారీ చేశారు. వారం రోజుల్లోగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల, వసతిగృహ ప్రాంగణాన్ని సీజ్ చేసి, అక్రమ అనుమతులపై నిఘా మరియు అవినీతి నిరోధక శాఖ (విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్) విచారణ చేపట్టాలని ఆదేశించారు. లేదంటే, ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంతో పాటు తెలంగాణ లోకాయుక్తను ఆశ్రయిస్తామని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నాయకులు స్పష్టం చేశారు.












