పర్యాటక ప్రాంతాల సందర్శనతో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడంతో పాటు ప్రకృతితో మమేకం కావచ్చని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం రంగనాయక సాగర్ వద్ద నిర్వహించిన హెరిటేజ్ వాక్‌ను జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 250 మంది విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పర్యాటకం అంటే కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించడం మాత్రమే కాదని, దాని వెనుక ఉన్న చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడమని పేర్కొన్నారు. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
విద్యార్థులకు పర్యాటక ప్రాంతాల సందర్శన
నవంబర్‌లో ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలకు పర్యాటకం కోసం ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున నిధులు అందించనుందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో 14 ఏళ్ల క్రితం ప్రపంచ పర్యాటక జాబితాలో 69వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 39వ స్థానానికి చేరిందని తెలిపారు. ప్రస్తుతం 175 దేశాల నుంచి పర్యాటకులు భారత్‌కు వస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఢిల్లీ పర్యటన అవకాశం
డిసెంబర్లో ఢిల్లీలో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వీక్షించేందుకు సిద్దిపేట జిల్లా నుంచి 50 మంది ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేసి పంపించాలని అధికారులను కోరారు. విద్యార్థులు పార్లమెంట్ సమావేశాలను వీక్షించడంతో పాటు న్యూఢిల్లీలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. పర్యటనకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఒగ్గుకథ ప్రదర్శించిన విద్యార్థులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.
స్థానిక చరిత్రను తెలుసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ పర్యాటకం అంటే ఇతర ప్రాంతాలు, దేశాలను సందర్శించడం మాత్రమే కాదని, ముందుగా మన జిల్లా, రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను తెలుసుకోవాలని సూచించారు. మన చరిత్ర, మన గొప్పతనం తెలుసుకున్నప్పుడే ఇతరుల చరిత్రను కూడా గౌరవించగలమన్నారు.
సిద్దిపేట జిల్లాలో ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఎల్లమ్మ చెరువుతో పాటు ప్రముఖ ఆలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక కేంద్రాలను విద్యార్థులకు దశలవారీగా పరిచయం చేస్తామని తెలిపారు.
గ్రామాలు, మండలాలు, జిల్లా చరిత్రతో పాటు ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రాలు, రాజుల కాలం నాటి శాసనాలు, వాటి చారిత్రక నేపథ్యాన్ని విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో పర్యాటక క్లబ్‌లను ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా నగదు బహుమతులు అందించి సన్మానించారు.












