నిర్మల్ జిల్లా మండలం తానూరు భోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక పదకొండు రోజుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. గ్రామస్తులంతా ఒక్కటై ఐక్యత, భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
గ్రామస్తులంతా కలిసికట్టుగా నిమజ్జన కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహించడం అభినందనీయమని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. భోసి గ్రామంలో భక్తిభావంతో పాటు ఐక్యత, సామాజిక సమరసతను చాటేలా ఉత్సవాలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
అనంతరం దేవాలయ అభివృద్ధి కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు కృషి చేసిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
భక్తి, ఐక్యత, సామాజిక సమరసతకు ప్రతీకగా భోసి గ్రామంలో నిర్వహించిన వినాయక ఉత్సవాలు ఆదర్శంగా నిలిచాయి.












