షాద్నగర్ పట్టణంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి () ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంతారా వారాహి మాత గణేష్ మండపాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం సందర్శించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ వినాయకుడికి, వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ విఘ్నేశ్వరుని కరుణాకటాక్షాలు, ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో విశేష రీతిలో మండపాన్ని తీర్చిదిద్ది, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు పట్లోళ్ల సాయి ప్రకాష్ రెడ్డి గారిని, కమిటీ సభ్యులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం ఎస్వీఎస్ఎస్ () సంస్థ భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను దిగ్విజయంగా కొనసాగించాలని, తమ వంతు పూర్తి సహకారం, అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.












