నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్పీ సూచించారు.
ప్రతి ఉత్సవ కమిటీ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రూట్ మ్యాప్, నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తు, భద్రతా చర్యలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
డీజే సౌండ్ విషయంలో నిబంధనలు పాటించాలని, రాత్రి వేళల్లో అధిక శబ్దం చేయవద్దని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే లేదా వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అందరూ సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












