తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ నకిలీ బాబా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతూ, ఆ దృశ్యాలను వీడియో తీసి డార్క్ వెబ్‌లో విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసాదంలో మత్తుమందు కలిపి బాధితులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న విజయరాజ(50) అనే నకిలీ బాబా, సేలం జిల్లా వజపాడిలో రహస్యంగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. సమస్యలతో తన వద్దకు వచ్చే మహిళలు, మైనర్ బాలికలకు మత్తుమందు కలిపిన తీర్థం, ప్రసాదాలు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి డార్క్ వెబ్‌లో విక్రయించేవాడని పోలీసులు స్పష్టం చేశారు.
ఇటీవల వినాయక చవితి చందాల కోసం వచ్చిన ఓ పాఠశాల విద్యార్థినితో విజయరాజ అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో సేలం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయరాజను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో భాగంగా, నకిలీ బాబా ల్యాప్‌టాప్‌లో 50కి పైగా అశ్లీల వీడియోలను పోలీసులు గుర్తించారు.
విచారణలో, తన వద్దకు వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు విజయరాజ అంగీకరించాడు. ఆపై వీడియోలు తీసి, డార్క్ వెబ్సైట్లలో విక్రయించి డబ్బులు పోగేసుకున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు అతడి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.












