మనిషికి మానవత్వమే మతమని కదం నాగేందర్ పటేల్ చాటిచెప్పారు. భైంసాలోని ఆరాధన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాంబేకు చెందిన సోఫియా ఖానం అనే రోగికి ఏబీ పాజిటివ్ రక్తం అత్యవసరంగా అవసరమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హమారా సహారా యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ అహ్మద్, భైంసా పట్టణ అధ్యక్షుడు తంజీద్ కాశిఫ్లను సంప్రదించారు.
రక్తదానం చేసిన యువకుడు
వెంటనే స్పందించిన వారు రక్తదాత కోసం ప్రయత్నిస్తూ, కదం నాగేందర్ పటేల్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మతం, కులం, ప్రాంతం అనే భేదాలు చూడకుండా మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. మంజరి నుంచి భైంసాలోని జీవన్‌దాన్ రక్తనిధి కేంద్రానికి చేరుకుని, తన విలువైన ఏబీ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. దీంతో రోగికి అవసరమైన సమయంలో రక్తం అందించేందుకు సహకరించి ప్రాణరక్షణలో తన వంతు పాత్ర పోషించారు.
కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
ఈ సందర్భంగా, కదం నాగేందర్ పటేల్‌కు రోగి కుటుంబ సభ్యులతో పాటు హమారా సహారా యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయూబ్ అహ్మద్, తంజీద్ కాశిఫ్, నర్సయ్య, నయీమ్ భాయ్, జీవన్‌దాన్ రక్తనిధి కేంద్రం నిర్వాహకుడు విశాల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి.












