మెదక్ మండల పరిధిలోని బాలికల వసతి గృహాల్లో సీనియర్ వార్డెన్గా పనిచేసిన పి. ఇందిరా స్వరూప రాణి సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
మెదక్ మండల పరిధిలోని దూదిగాం, లక్షెట్టిపేట, మెదక్ ప్రాంతాల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలోని బాలికల వసతి గృహాల్లో సీనియర్ వార్డెన్గా పి. ఇందిరా స్వరూప రాణి సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఆమె తన సేవలతో ఎంతోమంది విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడ్డారు. స్వరూప రాణి ఆకస్మిక మృతి పట్ల స్థానిక చర్చి ప్రతినిధులు, వసతి గృహాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వరూప రాణి భౌతికకాయాన్ని సిద్దిపేటలోని సి.ఎస్.ఐ. దేవాలయం నుంచి సమాధుల తోట వరకు భారీ ర్యాలీగా తరలించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక చర్చి పాస్టర్లు ఆంటోనీ, సాల్మన్ జయరాజ్, చరణ్, రాజు, వార్డెన్లు మేరీ పరంజ్యోతి, ప్రమీల అమృతరావు, సత్యవతి థామస్, దీవెన, ఇందిరతో పాటు పూర్వ విద్యార్థులు, చిన్ననాటి మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వరూప రాణికి కన్నీటి వీడ్కోలు పలికారు.












