కులమతాలకు అతీతంగా మానవత్వం, సోదరభావం చాటే ఘటన నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వినాయక చవితి సందర్భంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ లక్కీ డ్రా నిర్వహించారు. వందలాది మంది భక్తులు టోకెన్లు తీసుకుని పాల్గొన్న ఈ డ్రాలో ముస్లిం యువకుడు మొహమ్మద్ ఆరిఫ్ పటేల్ విజేతగా నిలిచారు.
లక్కీ డ్రాలో ఆరిఫ్ పటేల్ పేరు రావడంతో మండపం వద్ద సందడి నెలకొంది. నిర్వాహకులు ఆయనకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆరిఫ్ పటేల్ మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో లడ్డూ తనకు దక్కడం ఆనందంగా ఉందని, ప్రజలంతా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జామా మసీదు సదర్ ఏజాజ్, సర్పంచ్ పందిరి చంద్రకళా సూరి, బోయ సంఘం నాయకులు, గ్రామ ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.












